అయోధ్యలో రామయ్య నుదిటిన ‘‘సూర్య తిలకం ’’ .. ప్రతి శ్రీరామనవమికి ఎలా సాధ్యం..?

 


ఏళ్ల తరబడి పోరాటాలు, కలలు, ఆకాంక్షలు ఫలించి శ్రీరామ జన్మభూమి అయోధ్యలో భవ్య రామమందిరం ఆవిష్కృతమైంది. భారతీయుల శతాబ్ధాల నాటి కోరికను నెరవేరుస్తూ అత్యంత వైభవంగా ఆలయాన్ని నిర్మించారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆలయ ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత భక్తులను రామ్ లల్లా దర్శనానికి అనుమతిస్తున్నారు. 

అయోధ్య రామమందిరం నిర్మాణం విషయంలో ప్రత్యేకతలు వుండేలా ‘‘ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ’’ జాగ్రత్తలు తీసుకుంది. దీనిలో భాగంగా ప్రతి శ్రీరామనవమి రోజున అయోధ్య రామమందిరంలో అద్భుతం చోటు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. 

Also Read : లోక్‌సభ ఎన్నికలు : కర్ణాటకలో వీఐపీ సెగ్మెంట్లు ఇవే .. అందరిచూపూ ఇటే ..?

ఆ రోజున సూర్యభగవానుడు స్వయంగా శ్రీరామచంద్రుడిని తన కిరణాలతో అభిషేకిస్తారు. బాలరాముని నుదిటిపై సూర్యకిరణాలు నేరుగా పడతాయి. దాదాపు 6 నిమిషాల పాటు సూర్యకిరణాలు రాముని నుదిటిపై తిలకంగా కనిపిస్తాయి. అయోధ్య రామమందిరం భక్తుల దర్శనానికి అందుబాటులోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి శ్రీరామనవమి కావడంతో ఇవాళ ఈ సుందర దృశ్యాన్ని భక్తులు తిలకించి పులకించిపోయారు. 

ప్రత్యక్షంగా ఆలయంలోనూ, కోట్లాది మంది వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ‘‘సూర్య తిలకం ’’ను వీక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ హెలికాఫ్టర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ లైవ్ ద్వారా ఈ సుందర దృశ్యాన్ని చూశారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున గర్భగుడిలో వున్న రామ్‌లల్లా నుదిటిపై సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలకం దృశ్యం ఆవిష్కృతమవుతుంది. 

సూర్య తిలకం ఎలా సాధ్యమైంది :

అందుబాటులో వున్న అత్యాధునిక సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు అయోధ్య గర్భగుడిలో వున్న బాలరాముడి విగ్రహం నుదిటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల వ్యాసార్ధంలో ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు. పైపులు, కుంభాకార, పుటాకార కటకాల సాయంతో రూపొందించిన ఓ వ్యవస్థ సాయంతో ఈ అద్భుతం సాక్షాత్కరమైంది. 

ఆలయ శిఖర భాగంలో సూర్యుడి కాంతిని గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి తిలకంగా ఏర్పడుతుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ), కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ (సీబీఆర్ఐ) శాస్త్రవేత్తలు ఇందుకోసం ఎంతో శ్రమించారు. 

Also Read : 'ప్రతీకారం' తప్పదు .. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగిన ఇరాన్ సుప్రీం లీడర్ , ఎవరీ అయతుల్లా అలీ ఖమేనీ ..?

అది సరే కానీ.. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజునే సరిగ్గా ఆలయంలోని బాలరాముడి నుదిటిపై మధ్యాహ్నం 12 గంటల వేళ సూర్యతిలకం ఎలా పడుతుంది అనే డౌట్ మీకు రావొచ్చు. ఇందుకోసమే పరిశోధకులు మన గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే టెక్నాలజీ లాంటి గేర్ టీత్ మెకానిజాన్ని వాడారు. 

ఆలయం శిఖర భాగంలో సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్ద మరో పరికరం వుంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని సంవత్సరం పొడవునా కదుపుతూ వుంటుంది. మళ్లీ శ్రీరామనవమి వచ్చిన రోజున కాంతిని వారు అనుకున్న చోటుకి తీసుకొస్తుంది. 

Also Read : ప్రపంచంలోనే అత్యంత రద్దీగా వుండే విమానాశ్రయాలు .. టాప్ 10లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే..?

అయితే గ్రహాల పరిభ్రమణం, తిథులు, మాసాలు కొన్ని సార్లు మారుతూ వుంటాయి కదా అని అనుకోవచ్చు. ఇందుకోసమే శాస్త్రవేత్తలు ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకన్లతో సహా లెక్కకట్టి అందుకు అనుగుణంగా పరికరాలు, వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ దాదాపు 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 


Comments